Thursday, January 18, 2007

సుందర కాండ ఏడవ సర్గ

కారు మబ్బులు నిండిన నింగిన
మెరుపుల తళుకులు నిండిన ముబ్బువలె
మణులు అద్దిన కిటికీ తలుపులు
బంగారు కాంతులతొ వెలుగు చుండెను 1

శంఖము దుందుభి విల్లులు అంబులు
ఆయుధ సామాగ్రి నిండిన గదులను
విలువగు వస్తువులు నిండిన అటకలు
ఒక్కటొక్కటిగ వెదకుచు హనుమ తిరిగెను 2

వివిధ సంపదతొ అలరారు ఇండ్లను
లోపములులేక నిర్మిత కట్టడములను
రాక్షసులు సౌర్యముతో ఆర్జించిన
వివిధ ఆస్తులను హనుమ చూసెను 3

ఎంచగ లోపము ఒక్కటి లేక
మయుని చేత నిర్మింతమైన
అద్భుతమైన సుందర భవనము
మారుతి చూసెను అచ్చెరువంది 4

రావణ దర్పమునకు ప్రతిబింబము వలె
అతని శౌర్యమునకు తార్కాణము వలె
అతని తేజస్సుకు దర్పణము వలె
భూమికి దిగిన స్వర్గము వలె 5

వజ్ర వైధూర్యముల గుట్టలు గలిగి
పూలు పరిచిన దారులు గలిగి
సుగంధ పుప్పొడి నిండిన గాలులు గలిగి
వెలిగెడి కట్టడమును హనుమ చూసెను 6

యువతుల నడుమ సుందరి వలెను
మబ్బుల నడుమ మెరుపుల వలెను
పక్షుల నడుమ హంస వలెను
నింగి నడుమ మణుల గుట్ట వలెను 7

గ్రహముల కాంతితొ వెలిగెడి నింగి వలె
చంద్ర కాంతితొ మెరిసెడి మణి వలె
ఖనిజములు నిండిన పర్వత సిఖరము వలె
వింత కాంతులతొ వెలిగెడి భవనము
మారుతి చూసి అచ్చెరువందెను 8

భూమి అంతయు కొండల మయము
కొండలు అన్ని చెట్లతొ నిండెను
చెట్లకు విరిసెను మెరిసెడి పూలు
పూలు విసిరెను పుప్పొడి గంధము 9

తెల్లటి భవనములు మెరియు చుండెను
సరస్సులందు కలువలు నిండెను
ఝరణులు విధిగా పారు చుండెను
విప్పారిన కనులతొ హనుమ చూచుచుండెను 10

ఇంతలొ హనుమ అచ్చట కనుగొనె
విమాన మొక్కటి, సుందర దృశ్యము
పొదిగిన మణులతొ పేరు చెక్కబడె
పుష్పక మదియని హనుమ కనుగొనె 11

పుష్యరాగములు పక్షిగ మలచిరి
వెండియు పగడపు పక్షులు నిల్పిరి
వివిధ మణులతొ మలచిన పాములు
మేలు జాతి గుర్రపు శిల్పములమర్చిరి 12

బంగరు రెక్కపై పగడపు మెరుగులు
విలాస మొలుకుచు వంగిన రెక్కలు
బంగారు రేకులు తొడిగిన మెట్టులు
కాముని సహచర ప్రేరిత బొమ్మలు 13

కలువలు నిండిన కొలనులు గల్గి
కొలనులొ దిగిన గజములు గల్గి
తుండము నిందిన కలువలు గల్గి
లక్ష్మిని కొలిచెడి గజముల పటములు
మలచిన పుష్పకమును హనుమ చూసెను 14

దశకంఠుని మూకలు తిరిగెడి
రావణ పాలిత లంకలొ తిరుగుచు
సుందర మైనవి ఎన్నియో చూసెను
అచ్చెరువందెను, ఆనందించెను 15

అంతయు తిరిగినా దరి దరి వెదికినా,
పరమ సాధ్వియు లోక పూజితయు
శ్రీ రామ పత్నియు, జనక సుతయునగు
సీతను కానక మారుతి వగచెను 16

ఇంద్రియ నిగ్రహము, బుద్ధి కుశలత
నిశిత దృష్టియు, తర్క పటిమయు
ఇంతటి గుణములు కలిగి వుండియూ
మారుతి వగచెను సీత ను కానక 17